దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు రోజుకో కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ప్రధాని మోదీ కరోనా తిరగబెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని.. కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని సూచించారు. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాప్తిపై అలర్ట్ కాలేదని అనిపిస్తోంది. రాష్ట్రంలో కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నా.. సగటున 30 -40 వేల మధ్య టెస్టులతో సరిపెడుతోంది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,546 టెస్టులు నిర్వహించగా.. కొత్తగా 246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాకు చికిత్స పొందుతూ ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. తాజా కేసులతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,986కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 7187 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1909 యాక్టివ్ కేసులున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.