ఏపీలో కరోనా అధికారులకు ప్రశాంతత లేకుండా చేస్తోంది. ప్రతీరోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అంచనా వేయలేక వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రోజు నమోదైన కేసుల సంఖ్య అధికార యంత్రాంగాన్ని కలవర పెడుతోంది.
గత 24 గంటల్లో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కొత్తగా 10,057 కేసులు వెలుగు చూశాయి. అటు ఈ మహమ్మారితో ఎనిమిది మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 21,24,546కి చేరింది.
ఇప్పటివరకు 20,65,089 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 44,935 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి దాటికి 14,522 మంది మరణించారు. ఈరోజు విశాఖలోనే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. అటు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు ఏపీల వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా విజృంభణ ఎక్కువగా విశాఖ, చిత్తూరులోనే కొనసాగుతోంది. చిత్తూరు 1822 కేసులు, విశాఖలో 1827 కేసులు వెలుగు చూశాయి. ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నైట్ కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. అయినప్పటికీ ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.