గుంటూరు : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదంలో కూతురు, భర్తను కోల్పోయిన మధులతను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూతురిని తలచుకుంటూ గుండె పగిలేలా రోదిస్తున్న మధులతను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రమాద సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకోలేదని, వేసుకుని వుంటే ఇంత అనర్ధం జరిగేది కాదని విలపించారు. అందరూ లైఫ్ జాకెట్లు తీసేపి డ్యాన్స్ చేస్తున్నారని చెప్పారు. బోటుకు అనుమతి లేదన్న విషయం తమకు తెలియదని, తెలిస్తే ఎక్కేవాళ్లమే కాదని అన్నారు. బోటులో అందరూ విద్యావంతులే ఉన్నారని, బోటుకు పర్మిషన్ లేదన్న విషయం తెలిస్తే ఒక్కరు కూడా బోటు ఎక్కేవాళ్లు కాదన్నారు. పడవ బోల్తా పడిన వెంటనే భర్త సుబ్రమణ్యం తనను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారని చెప్పారు. ఆదే సమయంలో తన కాళ్లు పట్టుకున్న కుమార్తె హాసినిని పైకి నెట్టి రక్షించేందుకు ప్రయత్నించి ఆయన నీటిలో ముగినిపోయారని తెలిపారు. బిడ్డ తన కాళ్లను పట్టుకున్నా కాపాడుకోలేకపోయానంటూ మధులత వాపోయారు.
తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం తన తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి పాపికొండలు విహారయాత్ర వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు.