నెలల తరబడి సాగుతున్న ఉద్యోగ సంఘాల ఆందోళనలు చల్లారయి అనుకున్న లోపే మరోసారి ఉవ్వె్త్తున ఎగిసిపడ్డాయి. ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ.. మరోసారి నిరసనలకు సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చేశారు. పీఆర్సీ, డీఏ బకాయిలకు సంబంధించి జగన్ సర్కార్ సోమవారం రాత్రి విడుదల చేసిన జీవోలు ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేవని మండిపడుతున్నారు. ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ప్రకటించిన ఈ పీఆర్సీ, జీవోలు తమకు వద్దని తేల్చి చెప్పాయి. పూర్తిగా న్యాయం జరిగే వరకు సమ్మెకైనా సిద్ధమని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. రెండు రోజుల్లో తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని మండిపడ్డారు. జీవోలన్నింటినీ ఉద్యోగసంఘాలన్ని ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.
పదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఇస్తామనడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాకా సమరశంకం పూరిస్తామని తేల్చి చెప్పారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏలో తీవ్రంగా కోత విధించి ప్రభుత్వం దుర్మార్గమైన ఎత్తుగడ వేసిందని ధ్వజమెత్తుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటిరోజు అని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ, పింఛనులపై చర్చే జరగలేదన్న బొప్పరాజు.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని ఎత్తివేస్తారా? అని నిలదీశారు.
ఈనెల 20న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తమ ఉద్యమాల ద్వారా జరగబోయే అసౌకర్యానికి ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని అని తేల్చి చెప్పారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుంటే.. ఉద్యమం తీవ్రమవుతుందని హెచ్చరించారు. తమ పోరాటాలకు, సమ్మెలకు ప్రజలు సహకరించాలని కోరారు.