ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్య ఇప్పట్లో తేలేలా లేదు. సమస్యను పరిష్కరించడానికి మంత్రులతో ఓ కమిటీ వేసింది. కానీ.. ఉద్యోగులు మాత్రం సమ్మెకు సై అంటున్నారు. తమ హక్కులను ఉద్యమం ద్వారానే సాధించుకుంటామని ప్రకటించారు. సమ్మెకు వెళ్తామని ఎప్పుడూ అనుకోలేదని..కానీ.. తప్పడం లేదని ఏపీ పీఆర్సీ సాధన సమితి సభ్యులు అన్నారు.
తమ డిమాండ్లు పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందని ఆగ్రహించారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుంటామని చెబుతున్న ప్రభుత్వం వాటి పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇటీవల సర్కార్ ప్రకటించిన ప్రోత్సహకాల విషయంలో తమనే కాదు.. పౌరసమాజాన్ని కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.
ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసిందని విన్నామని.. కానీ.. ఈ కమిటీలతో తమ సమస్యలు పరిష్కారం కావని అన్నారు. 23న జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సమ్మెకు దిగాలని నిర్ణయించామని.. త్వరలో నోటీసు కూడా ఇస్తామని తేల్చి చెప్పారు. తాము చేయబోయే ఉద్యమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరించారు. 13 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్ల ఉద్యమమని గ్రహిస్తే మంచిదని హితబోధ చేశారు.
కాగా.. ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చించారు. ప్రభుత్వం ఉద్యోగులను సమ్మెకు వెళ్లకుండా బుజ్జగించేందుకు ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వానిది ఒకదారి.. ఉద్యోగులది ఒక దారిలా కనిపిస్తోంది.