ఏపీలో పీఆర్సీ రగడ పీక్స్ కు చేరింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉద్యమానికి సై అంటున్నారు. విజయవాడలో పీఆర్సీ సాధన సమితి సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించింది.
ఇటు ఉద్యోగులతో సంప్రదింపుల కోసం మంత్రుల కమిటీని వేసింది ప్రభుత్వం. మంత్రులు బుగ్గన, పేర్ని నాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ తో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంప్రదింపుల కోసం కమిటీ ఏ ఉద్దేశంతో వేశారో తమకు తెలియదన్నారు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్.
పీఆర్సీ ప్రకటన తర్వాత మంత్రుల కమిటీ చేసేందేంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఇది నమ్మేలా లేదని.. గతంలో ఇలాగే మెత్తబడినట్టు కన్పించి పీఆర్సీ జీవోలు జారీ చేశారని మండిపడుతున్నారు. 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగులు.
ఈనెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఉద్యోగులు. అలాగే 27 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ, 5 నుంచి సహాయ నిరాకరణ, 7 నుంచి సమ్మెకు వెళ్లాలని కార్యాచరణను ప్రకటించారు.