ఉద్యోగులు కదం తొక్కారు. పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఛలో విజయవాడ సక్సెస్ అయింది. వేలాదిగా ఉద్యోగులు తరలిరావడంతో ‘వుయ్ వాంట్ జస్టిస్’ నినాదాలతో బెజవాడ వీధులు హోరెత్తాయి. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు అమలు చేసే ప్రయత్నం చేసినా ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డులో ఎటుచూసినా ఉద్యోగులే కనిపించారు. మారువేషాల్లో పోలీసులను బోల్తా కొట్టించినట్టు వారంతా వచ్చినట్లు తెలుస్తోంది. రైతులు, కూలీల వేషంలో విజయవాడ చేరుకున్నట్లు చెబుతున్నారు.
వేలాది మంది ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉండిపోయారు. ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డులో బహిరంగ సభకు అనుమతి లేకపోవడంతో పీఆర్సీ సాధన సమితి నేతలు ట్రాలీ ఆటో పైనుంచి ప్రసంగించారు.
ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ. తీవ్ర నిర్బంధాల మధ్య కూడా లక్ష మంది విజయవాడ వచ్చారని వెల్లడించారు. మరో 3 లక్షల మందిని ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.
మరో నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ ఉద్యోగులను చర్చలకు పిలవాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం నేరుగా చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నామని.. సీఎం జోక్యం చేసుకుని చర్చలతో సమస్యలు పరిష్కరించాలని కోరారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఛలో విజయవాడ కార్యక్రమం చూశాక అయినా ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దయ్యే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇక ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. తాము ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించింది బల ప్రదర్శన కోసం కాదన్నారు. ఉద్యోగుల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ నెల 5 నుంచి పెన్ డౌన్ ఉంటుందని.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళతామని బొప్పరాజు వెల్లడించారు.