ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లేటెస్ట్ గా ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోందని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సైక్లోన్ ముప్పుపై ఏపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను నీట ముంచి, ఆ తర్వాత ప్రభుత్వం హడావుడి చేయడం కాదని.. ముందే తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజలను వరదలకు వదిలేయకుండా, ముందుగానే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయండని సలహా ఇచ్చారు. ఈ మూడున్నరేళ్లలో రాయలసీమలో వరదలకు, గోదావరి వరదలకు ప్రభుత్వం ఎంత అలసత్వంగా ఉందో అంతా చూశామన్నారు. విపత్తుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ, విపత్తు తర్వాత బాధితులకు సాయం అందించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు.
గతంలో ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వివరించారు. ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సహజ అలసత్వాన్ని వీడి, విపత్తు నష్టాలను, కష్టాలను తగ్గించడానికి సిద్ధమవ్వాలని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, టీడీపీ వర్గాలు కూడా తుపానుపై అవసరాన్ని బట్టి స్పందించాలని పిలుపునిచ్చారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో ముప్పు మొదలయ్యే అవకాశముంది. దానికి తోడు 20వతేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుందనే అంచనాలున్నాయి. ఆ తర్వాత తుపాన్ గా మారుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ తుఫాన్ కి సిత్రాంగ్ అనే పేరు కూడా ముందుగానే పెట్టేశారు. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీతోపాటు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.