కర్నూలు: ఏపీ ఫైబర్ నెట్‌లో వేళ్లూనుకున్న అవినీతి భాగోతం బయటపడుతోంది. పైనుంచి కింద వరకు వేల కోట్ల రూపాయలు దోచుకున్న నీచుల బండారం బయటపడుతోంది. కర్నూలులో ఏపీ ఫైబర్ నెట్ జిల్లా మార్కెటింగ్ మేనేజర్ ఆర్. రామచంద్ర ఒక లక్షా 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిపోయాడు. ఈ లంచంలో ఉన్నతస్థాయి అధికారులకూ వాటా ఉందని అతను చెప్పినట్టు తెలిసింది. ఒక ఆపరేటర్‌కు లోకల్ ఛానెల్స్ కలిపేందుకు ఈ డబ్బు డిమాండ్ చేశాడు. గత ప్రభుత్వంలో అట్టహాసంగా పెట్టిన ఏపీ ఫైబర్ నెట్‌లో మొదటి నుంచి సామాన్య ఆపరేటర్‌లను నిలువునా ముడుపులు దోచుకుని ముంచేశారు. రెండేళ్లుగా ఏపీ ఫైబర్ ఉద్యోగులు, అధికారుల అవినీతికి ఆపరేటర్లు బలైపోయారు. అందినకాడికి దోచుకొని ఏపీఫైబర్ వ్యవస్థను నాశనం చేశారు. మిగిలిన జిల్లాలలో ఉన్న ఏపీ ఫైబర్ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేస్తే ఇప్పటికైనా ఆపరేటర్లు బాగుపడతారని ఏపీ ఫైబర్ బాధిత ఆపరేటర్లు పిలుపునిచ్చారు.