అమెరికాలోని సియాటిల్ నగరంలో ఓ తెలుగు యువతి రోడ్డుప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వాహనమే ఈ యాక్సిడెంటుకి కారణమవడం మరింత విచారించ తగ్గ విషయం. వేగంగా వచ్చిన పోలీస్ కార్ ఢీ కొట్టడంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. యాక్సిడెంట్ విషయం తెలిసి అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని కొనఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ప్రమాదంలో చనిపోయిన యువతిని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించారు.
ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. సియాటిల్ లో ఉంటున్న కందుల జాహ్నవి..థామస్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. దీంతో జాహ్నవికి తీవ్ర గాయాలయ్యాయి.
అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా.. జాహ్నవి మరణించింది. కాగా, ఈ ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని సియాటిల్ పోలీసులు చెప్పారు. అయితే, అతని వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.