ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించటం లేదని మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం రియాక్ట్ అయింది. తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వెల్లడించారు.
మెజార్టీ ఉద్యోగులకు నెల తొలినాళ్లలోనే జీతాలు పడుతున్నా.. బిల్లుల సమర్పణలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల కొద్ది మందికి 20వ తేదీ వరకు సమయం పడుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమం, కొత్త నియామకాలు, ఇతర అన్ని అంశాలతో 8 పేజీల లేఖ రిలీజ్ చేసింది.
గత ప్రభుత్వం ఉద్యోగులకు 5 డీఏలు బకాయిలు పెట్టినా పట్టించుకోని వార్తా పత్రికలు.. ఇప్పుడు ప్రచురిస్తున్న కథనాలను ఎస్ఎస్ రావత్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇలాంటి వార్తలు రాసిన వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు.
ఉద్యోగులు, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామంటూ.. శనివారం ఆయన ఓ ప్రటకన రిలీజ్ చేశారు. తప్పుడు కథనాలను నమ్మొద్దని, ఉద్యోగుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు ఎస్ఎస్ రావత్.