ఆన్లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏపీఎఫ్ డీసీ సర్వీస్ ప్రొవైడర్ కు బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్ డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం. ప్రతి టికెట్ పై సర్వీస్ చార్జీలు 2 శాతం మాత్రమే వసూలు చేయాలని తెలిపింది. నెల రోజుల్లోగా అన్ని థియేటర్లలో ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని థియేటర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.
థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు జరపాలని సూచించింది. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్ల అమ్మాకాలు జరపాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. అలాగే ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
అయితే.. గతంలో సినీ ప్రముఖులతో సమావేశం నిర్శహించిన మాజీ మంత్రి పేర్ని నాని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే అమలయ్యేలా ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొస్తామని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. దానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.