ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ప్రభావంతో హైదరాబాద్‌లో ఇరుక్కున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే, స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనుంది.
ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు పంపారు. ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ ఛార్జీ వసూలు చేస్తారు. ఈ బస్సులు మియాపూర్-బొల్లారం క్రాస్‌రోడ్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్, ఎల్బీ నగర్ నుంచి వెళ్లనున్నాయి. రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారిని తీసుకొచ్చేందుకు సర్వీసులు నడపనున్నారు.