ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటోంది. మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామని మంత్రులు చెబుతున్నారు. అయితే మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావించకుండానే అయిపోయింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, గవర్నర్ బిశ్వ భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
అనంతరం ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలను తెలియజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం ఆ గొప్ప దేశభక్తులందరి సంస్మరణ దినం. వారి త్యాగాల వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛా ఫలాలను అనుభవించడం సాధ్యమైందన్నారు. సత్యం, అహింస, శాంతి, ఐకమత్యం, సార్వత్రిక సౌభ్రాతృత్వం ఉదాత్తమైన ఆదర్శాలకు పున: అంకితం చేసే రోజు అన్నారు. డీబీటీ ద్వారా నవరత్నాలు అర్హులై ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు.
కుల,మత, ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఇంటికీ వెళ్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు బిశ్వభూషణ్. ముఖ్యంగా విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. అమ్మఒడితో పాటూ ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని వివరించారు.
జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు, దుస్తులు, స్కూల్ కిట్ అందిస్తున్నారన్నారు గవర్నర్. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందతున్నాయని.. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రూ.2750 సాయం అందిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం చాలా పథకాలు అమలు చేస్తున్నారని.. త్వరలో సంచార పశువైద్య క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నారన్నారు. అయితే ఈ ప్రసంగంలో గవర్నర్ ఎక్కడా మూడు రాజధానుల అంశం ప్రస్తావించలేదు.