రాజధానిపై నిపుణుల కమిటీ చాలా స్పీడుగా పని చేస్తోంది. త్వరలోనే రిపోర్టు ఇచ్చేస్తుంది. కాని అది ఏ రిపోర్టు ఇవ్వాలో.. ఎప్పుడు ఇవ్వాలో ముందే స్క్రిప్టు రచించేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ పేరుతో ఒక్కో జిల్లాలో ఒక్కో అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ నిపుణుల కమిటీ ప్రతిపాదించబోతుందని సమాచారం. కాకపోతే రాజధాని అంటే చంద్రబాబు చెప్పిన రాజధాని మాత్రం రాష్ట్రంలో ఎక్కడా ఉండదు.
రాజధాని అంటే ప్రస్తుతం ఒక సెక్రటేరియేట్, డిపార్ట్ మెంట్ ఆఫీసులు, అసెంబ్లీ, సీఎం, మంత్రుల ఆఫీసులు, క్వార్టర్లు అంతే. అది ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇల్లు ఉన్న తాడేపల్లి, ఆ తర్వాత మంగళగిరి అంటే తాడేపల్లి నుంచి మంగళగిరి దాకా ఈ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిని నడిపించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాజధాని ప్రాంతం మార్చలేదని చెప్పుకోవచ్చు.. అటు అసలైన రాజధానిని లేకుండా చేయొచ్చు. ఇతర ప్రాంతాల్లో వేరే రూపంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే.. అక్కడ కూడా మద్దతు పొందొచ్చు. ఇదే కాన్సెప్టులో జగన్ ఉన్నట్లు.. రేపు నిపుణుల కమిటీ కూడా అదే ఇవ్వబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే తాడేపల్లి సీఎం ఆఫీసు చుట్టూ ఉన్న బిల్డింగులు, స్ధలాలు వారి మనుషుల కంట్రోల్ లోకి వెళ్లిపోయాయి. భారతి సిమెంట్ లాంటి జగన్ కంపెనీల కార్పొరేట్ ఆఫీసులు కూడా ఇక్కడే తాడేపల్లి సీఎం ఆఫీసుకు దగ్గర్లోనే పెడతారని టాక్ వినపడుతోంది. తాడేపల్లి నుంచి నాగార్జున యూనివర్శిటీ వరకు విజయవాడ-గుంటూరు హైవే పై ఈ రాజధాని ఉండబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా డిక్లేర్ చేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఇవి రెండు కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చే ఆలోచన కూడా వారికి ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే వైసీపీ నేతలు ఈ ఏరియాలో త్రీ స్టార్ హోటళ్లు రెడీ చేస్తున్నారు. వారి వ్యూహానికి అనుగుణంగా వ్యాపార సంస్థలను కూడా ఇదే ఏరియాలో ఏర్పాటు చేసుకోవడానికి అనుగుణంగా కసరత్తు కూడా నడుస్తోంది.