తెలంగాణ ఏర్పడి చాలా కాలమే అయింది. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని పంచాయితీలు ఉన్నాయి. అవి కొలిక్కి రావడం లేదు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో ఏపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై విచారణ జరిపింది న్యాయస్థానం.
రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపిణీ విషయంపై ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్ వేసింది. ఆస్తుల విభజన సరిగ్గా జరగక ఆర్థికంగా నష్టపోయామని పిటిషన్ లో పేర్కొంది ఏపీ. అంతా న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలివ్వాలని విన్నవించింది. విభజన సమయంలో తెలంగాణకు రూ.1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తి చేకూరిందని పేర్కొంది. దాదాపు 91 శాతం ఆస్తులు హైదరాబాద్ లోనే ఉన్నాయని.. చట్టప్రకారం తమకు రావాల్సిన ఆస్తులను తెలంగాణ పంచడం లేదని.. అలాగే ఈ విషయంలో కేంద్రం సైతం జోక్యం చేసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అయితే.. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు విచారణకు హాజరు కాలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీం. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం.. దానిపై రీజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈక్రమంలోనే తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ, కేంద్రానికి ఆరు వారాల గడువు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.