ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దుకాణాలను తెరిచేందుకు అదనపు మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కంటైన్‌మెంట్, బఫర్‌జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, వస్త్ర, చెప్పుల దుకాణాలకు కూడా అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దుకాణాల వద్ద విధిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.