ఓ చేత్తో ఇస్తూనే… మరో చేత్తో ఎలా తీసుకోవాలో సీఎం జగన్ కు బాగానే ఒంటబట్టినట్లు కనపడుతుంది. నేను నా ఎన్నికల హామీ అయిన డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తానని చెప్పిన దాన్ని నేరవేరుస్తూ, మొదటి దఫాగా మహిళల అకౌంట్లో డబ్బులు వేసినట్లు సీఎం జగన్ ప్రకటించారు. అలా మహిళల అకౌంట్లో డబ్బులు వేశారో లేదో మరుసటి రోజే రాష్ట్రంలో వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది.
దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటికీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉన్న పెట్రోలియం ఉత్పత్తులపై మాత్రం పాత పన్నుల విధానమే కొనసాగిస్తున్నాయి. పెట్రోల్, డిజీల్, గ్యాసుపై కేంద్రానికి పెత్తనం ఇచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోక… వ్యాట్ విధానాన్నే అనుసరిస్తున్నాయి.
తాజాగా రాష్ట్రంలో వంట గ్యాస్ పై పన్నులను జగన్ సర్కార్ భారీగా పెంచేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుతో భారంగా మారిందని, ఖజానాకు ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 14.5శాతం ఉన్న పన్నును ఏకంగా 24.5శాతానికి పెంచేసింది. అంటే గతంలో 100రూపాయలకు 14.5రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తే ఇప్పుడా రేటును ఏకంగా 24.5 రూపాయలకు పెంచేశారు. దీంతో రాష్ట్రంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరగున్నాయి.