తిరుమలలో మరిన్ని ‘నిఘా’ నేత్రాలు
ఫేజ్-2లో పూర్తికావస్తున్న 1,050 సీసీ కెమెరాల అమరిక
రూ. 15.48 కోట్ల వ్యయంతో ఏర్పాటు
బ్రహ్మోత్సవాల నాటికి 1330 కెమెరాలతో నిఘా
తిరుమల : కోట్లాది భక్తుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో సీసీ కెమెరాల నిఘా మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ఫేజ్-2లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాల అమరిక పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. రేపటి బ్రహ్మోత్సవాల నాటికి తిరుమలలో మొత్త్తం 1,330 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా, భద్రతా వ్యవస్థ ఏర్పాటుకానుంది. అనునిత్యం వేలాది మంది సంచరించే తిరుమల క్షేత్రంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు త్వరితగతిన స్పందించేందుకు, అనుమానితులు, సంఘ విద్రోహులు, పాత నేరస్తులను సులభంగా గుర్తించడం కోసం, ట్రాఫిక్‌ను, భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనించడం కోసం అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుకు టీటీడీ సంకల్పించింది. ఇందులోభాగంగా మొదటి ఫేజ్‌లో శ్రీవారి ఆలయం, నాలుగు మాడవీధుల్లో 280 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ఏడాది క్రితం అందుబాటులోకి తెచ్చారు.
ఫేజ్-2లో 1050 కెమెరాలు
ఆలయం, మాడవీధులతో పాటు జనసమ్మర్ధ ప్రాంతాలపైనా మరింత నిఘా ఉంచేందుకు వీలుగా ఫేజ్-2లో మరో 1050 కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం టీటీడీ రూ.15.48 కోట్ల నిధులు కేటాయించింది. వీటి ఏర్పాటుపై విస్తృత పరిశీలన జరిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1,2, క్యూలైన్లు, నాలుగు యాత్రికుల ఉచిత సముదాయాలు, ఆర్టీసీ బస్టాండులు, శ్రీవారి సేవాసదన్లు, ప్రధాన ప్రధాన, మినీ కల్యాణకట్టలు, కల్యాణవేదిక, వీఐపీలు బసచేసే పద్మావతినగర్, జీఎస్సీ టోల్‌గేట్, వాణిజ్య సముదాయాలు, ఎస్వీ మ్యూజియం, అన్నదాన సముదాయం, ప్రధాన కూడళ్లు, భక్తజన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటు పనులను నేషనల్ స్మాల్ ఇండ్రస్టీస్ కార్పొరేషన్ కంపెనీ నిర్వహిస్తోంది.
పూర్తికావచ్చిన కెమెరాల ఏర్పాటు
రెండో దశలో నాలుగు నెలల క్రితం పారంభమైన సీసీ కెమెరాల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. ప్రస్తుతం అమరుస్తున్న కెమెరాల్లో ఇండోర్, అవుట్‌డోర్ ఫిక్స్‌డ్ బుల్లెట్ కెమెరాలు, పీటీజెడ్ (పాన్-టిల్ట్-జూమ్) అవుట్‌డోర్ కెమెరాలు ఉన్నాయి. ఈ మూడు రకాల కెమెరాలతో పాటు ఎక్కడికక్కడ సిగ్నల్ టవర్స్, సర్వర్లు, యూనిట్‌బాక్సులు, యూపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కేబుల్స్ గాలిలో వేలాడకుండా భూగర్భంలోనే అమర్చడానికి వీలుగా అండర్‌గ్రౌండ్ కేబుల్‌సిస్టమ్ ఏర్పాటుచేశారు. ఈనెల 20వ తేదీలోపే అన్ని కెమెరాలను అమర్చి సెంట్రల్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానిస్తారు. మొత్తంమీద శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి 2,330 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా తిరుమలలో సమకూరనుంది. కాగా, ఫేజ్-3లో ఘాట్‌రోడ్లు, అవుటర్ రింగురోడ్డు, నారాయణగిరి ఉద్యానవనంలోని స్లాటెడ్ కొత్త షెడ్లు, శ్రీవారిపాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, ఆకాశగంగ, ఉద్యానవనాలు తదితర సందర్శక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.