చంద్రబాబు ఆనవాళ్లేవీ తన ప్రభుత్వంలో వుండకూడదని డిసైడైన జగన్ సర్కార్ తాజాగా ఆర్‌టీజీపై ఫోకస్ పెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్‌టీజీ అనే వ్యవస్థను పూర్తిగా ఎత్తేయడమో.. లేదా దాని పేరు, రూపురేఖలను పూర్తిగా మార్చడమో కొద్ది రోజులలో నిర్ణయం తీసుకోబోతున్నారు.
గుంటూరు: చంద్రబాబు హయాంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ అనేది ఆరంభంలో వినడానికి చాలా కొత్తగా అనిపించేది. రానురాను ఆ మాట ఒక హాస్యాస్పదమైన మాటగా మిగిలిపోయింది. చంద్రబాబులో ఆనాటి డైనమిజం అస్సలు కనిపించకపోవడానికి ఈ ఆర్టీజీ సగం కారణమని చాలామంది చెప్పుకునేవారు. ఆర్టీజీలో కూర్చుని గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోలేక పోవడం వల్ల ఐదేళ్ల తరువాత ఎన్నికల్లో టీడీపీ అధినేత చావుదెబ్బ తిన్నారంటారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ అనే పద ప్రయోగమే అసలు తప్పుడు మాట అని విద్యావంతులు అంటుంటారు. ప్రభుత్వం అనేది ఎప్పుడూ రియల్‌టైమ్‌లోనే పాలన వ్యవహారాలు సాగిస్తుండాలి. అత్యాధునిక సాంకేతికత అందిపుచ్చుకున్న దరిమిలా ఇప్పుడు ప్రతీదీ రియల్‌టైమ్‌లోనే సాధ్యమవుతోంది. అందులో చంద్రబాబు ప్రత్యేకంగా సాధించింది ఏదీ లేదు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేయడం కోసమే అక్కడ ఆయన్ని కూర్చోబెట్టారు. అధికార యంత్రాంగానికి అన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తూ మేపడం కూడా రియల్‌టైమ్ మానిటరింగ్ కోసమే కదా! అదేదో ఎవరికీ సాధ్యం కాని వ్యవహారంలా భావించి లేనిపోని భ్రమల్లో వుండి పోవడం వల్లనే చంద్రబాబు అధికారానికి దూరమయ్యారని టాక్! ఇంతా చేసి ఈ రియల్‌టైమ్ గవర్నెన్స్ వ్యవస్థలో ప్రత్యేకమైనదేదైనా వుంటుందా అంటే లేదు. పోనీ, అత్యాధునికమైన యంత్రాంగం వుంటుందా అంటే అది కూడా లేదు. సాంకేతికత కూడా కొత్తగా ప్రవేశపెట్టిందేదీ కాదు. పెద్ద పెద్ద టెలివిజన్ సెట్లు చుట్టూ గోడలకు అమర్చివుంటాయి. వాటిల్లోంచి మనం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ప్రత్యక్షంగా చూడవచ్చు.
నిజానికి ఈ సెటప్ వుండాల్సింది ఇక్కడ కాదు, పోలీస్ కంట్రోల్ రూమ్‌లో. ట్రాఫిక్ నిరంతర పర్యవేక్షణకు మాత్రమే ఇది అక్కరకొస్తుంది. సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునే బాధ్యత సీయంది కాదు, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగానిది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ కూర్చుని పర్యవేక్షణ చేస్తే ఆయన్ని ముఖ్యమంత్రి అని అనకూడదు. ట్రాఫిక్ నియంత్రణాధికారి అని అనాలి.
ఇక, ఈ ఆర్టీజీలో మనం తెలుసుకునే మరో ఏర్పాటు ఏంటంటే.. క్షేత్రస్థాయి గణాంకాలు. అంటే ఎక్కడ ఎన్ని కిలోల రేషన్ బియ్యం పంపిణీ జరిగింది..? ఎక్కడ ఏ జిల్లాలో ఎంత మేర పెన్షన్ల పంపిణీ జరిగింది..? ఎక్కడెక్కడ స్కాలర్‌షిప్‌లు ఎంతెంత అందించారు..? ఇలాంటి గణాంకాలు తీసి ఎప్పటికప్పుడు సీయంవోలో అందజేస్తుండటం ఈ ఆర్టీజీ చేసే మరో ముఖ్యమైన పని. వాస్తవానికి ఆయా శాఖలన్నీ ఈ లెక్కల్ని ఎప్పటికప్పుడు పై అధికారులకు, అవసరమైన సమయంలో ముఖ్యమంత్రికి అందజేస్తుంటాయి. వాటి కోసం అన్ని శాఖల్లో ప్రత్యేకమైన యంత్రాంగం కూడా వుంటుంది. వాటి మీద విశ్వాసం లేని గత ముఖ్యమంత్రి.. తనకు నమ్మకం వున్న అధికారులను నియమించుకుని వారి ద్వారా ఈ లెక్కలు తెలుసుకుని ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపిస్తున్నానని అనుకునే వారు.
అసలు ఈ ఆర్‌టీజీ ఎలా ఆవిర్భవించిందటే.. గత ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ‘సీయం కోర్ డ్యాష్ బోర్డు’ పేరుతో ఒక పోర్టల్ వుండేది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఇంచ్ ఇంచ్ నాకు తెలియాలని నిర్ణయించుకుని ఆ క్రమంలో భాగంగా గత ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే ఈ ఆర్‌టీజీ.
గత ముఖ్యమంత్రికి సాంకేతికత మీద వున్న మోజును కొంతమంది అధికారులు కూడా చాలా తెలివిగా ఉపయోగించుకుని సీయంవోలో స్థానం సంపాదించారు. ముఖ్యంగా ఐఎఎస్ అధికారి అహ్మద్‌బాబు గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆర్‌టీజీలో ముఖ్యమంత్రిని గంటల తరబడి కూర్చోబెట్టేసి 80 శాతం ప్రజా సంతృప్తి, 90 శాతం ప్రజా సంతృప్తి.. కొన్ని సందర్భాల్లో మరీ వోవర్‌గా 99 శాతం ప్రజా సంతృప్తి అంటూ లెక్కలు చెప్పి ఏమార్చిన వైనం ఎవరూ మరచిపోలేరు. అహ్మద్‌బాబు హయాంలోనే వెలగపూడి సచివాలయం ఆనుకుని వున్న విశాలమైన స్థలంలో భారీ తాత్కాలిక భవన నిర్మాణాన్ని కూడా ఆర్టీజీ కోసం ప్రత్యేకంగా చేపట్టారు. అది సీయంవో బిల్డింగ్‌కు మించి వుంటుంది. అంతకుముందు.. అంటే కృష్ణా పుష్కరాల సమయంలో ఇంద్రకీలాద్రికి ఎదురుగా దుర్గా ఘాట్ సమీపంలో ఎంతో వ్యయం చేసి ఇలాంటి సెంటర్ ఒకదాన్ని ఏర్పాటుచేశారు. అక్కడ జన తాకిడి ఎక్కువగా వుందని చెప్పి అక్కడి నుంచి బందరు రోడ్డులోని మరో భవంతిలోకి మార్చారు. ఇలా అహ్మద్‌బాబు, అతని బృందం చంద్రబాబును తిప్పడమే కాకుండా సంతృప్తి లెక్కలు చెప్పి చెప్పి ఆయన్ని ఒకలాంటి భ్రాంతిలో పడేసి చివరికి ముంచేసిందని తెలుగుదేశం వర్గాలే బాహాటంగా చెబుతాయి.
ఇదంతా ఇలావుంటే, కొత్త ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు సహా చంద్రబాబు ఆనవాళ్లు ఏవీ లేకుండా చేయడంపై ఫుల్ ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ తాజాగా ఈ ఆర్‌టీజీని ఏం చేయాలనే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఆర్‌టీజీ ప్రస్తుతం సీయంవోలోనే కొనసాగుతోంది. చంద్రబాబు హయాంలో నియమించిన కాంట్రాక్టువల్ సిబ్బందిని అన్ని శాఖల్లో తొలగిస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం ఎందుకో ఇన్నాళ్లూ ఆర్‌టీజీ జోలికి మాత్రం పోలేదు. ఐతే, అసలు సీఎంవోలోకే రెగ్యులర్‌గా రాని ముఖ్యమంత్రి.. ఆర్‌టీజీ అవసరం మాత్రం తనకెందుకని భావిస్తున్నట్టుగా సమాచారం. గత ముఖ్యమంత్రిని భ్రమల్లో వుంచేసిన ఆర్‌టీజీని నమ్ముకుంటే తమకు కూడా అదే గతి పడుతుందని వైసీపీ ముఖ్యులు ఒకరిద్దరు ఆయనతో అన్నట్టు భోగట్టా.
ఆర్‌టీజీ కూడా నిజానికి ఇప్పుడు చేస్తున్న అద్భుతమైన విధులు ఏవీ లేవు. రెండు, మూడురోజులకు ఒకసారి ఆర్‌టీజీ పేరుతో ఒక పత్రికా ప్రకటన వస్తుంటుంది. అది కూడా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే. ఈ పూట ఫలానా ప్రాంతంలో పిడుగులు పడవచ్చును.. లేదా ఈరోజు తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం వుంది. తీరంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి… గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం వుంది.. తరహా ప్రకటనలు చేయడం మినహా ఈ విభాగం వల్ల అదనంగా ప్రభుత్వానికి ఒరిగేది కూడా ఏదీ లేదనే వ్యాఖ్య వినిపిస్తోంది. వాస్తవానికి ఈ అప్రమత్తం చేయడం వాతావరణ శాఖ బాధ్యత. చంద్రబాబు హయాంలో అన్నీ తానై చక్రం తిప్పిన ఆర్‌టీజీ ప్రస్తుతం చేసేందుకు ఏదీ లేక వాతావరణ శాఖకు ప్రత్యామ్నాయ విభాగంగా తనకు తాను కొత్త విధులలో నిమగ్నమైనట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఈ ఆర్‌టీజీ ఒకసారి తుఫాన్ సంభవించినప్పుడు చాలా హడావుడి చేసి తీర ప్రాంత రైతాంగాన్ని తీవ్రంగా భయపెట్టేసింది. తీరా చూస్తే వీరిచ్చిన సూచనలకు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన వివరాలకు అస్సలు పొంతన లేకుండా పోయి ప్రభుత్వం విమర్శల పాలైంది. పైగా ఆర్‌టీజీకి అప్పట్లో పనిచేసిన ఓ అధికారి అత్యుత్సాహం వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాలతో పాటు అసలు తుఫాన్ ప్రభావమే లేని గుంటూరు జిల్లా రైతాంగానికి కూడా బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాల్సివచ్చింది కూడా.
ఇదంతా తన సొంత నెట్‌వర్క్ ద్వారా తెలుసుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అసలు ఆర్‌టీజీని ఎత్తేయాలని, మరీ అవసరం అయితే దాని రూపురేఖలు పూర్తిగా మార్చి, పేరు కూడా కొత్తది పెట్టి దాని సేవల్ని వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొంతమంది కన్సల్టెంట్లు ఆర్‌టీజీకి వచ్చి ఆ వ్యవస్థను పరిశీలించి వెళ్తున్నట్టు సమాచారం.