‘ఏమిరా బాలరాజు.. నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగం..’ అంటూ అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి అనే మూవీలో ఓ డైలాగ్ ఒకటుంది. ఇప్పుడు జగన్ సర్కార్ నియామకాలు కూడా అలా కామెడీగానే వున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
సాక్షి కుటుంబానికి చెందిన దేవులపల్లి అమర్ అనే మోస్ట్ సీనియర్ జర్నలిస్టుకు జగన్ ప్రభుత్వం ‘అడ్వయిజర్ ఫర్ నేషనల్ మీడియా అండ్ ఇంటర్ స్టేట్ అఫైర్స్’ అనే పోస్టు ఒకటి క్రియేట్ చేసి ఢిల్లీ కేంద్రంగా కొలువిచ్చింది. దేవులపల్లి అమర్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, రాతలను ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో సలహాదారుగా నియమించుకునేందుకు జగన్‌కు ఏపీలో సీనియర్ జర్నలిస్టులే దొరకలేదా అంటూ ఆ మధ్య రచ్చరచ్చ అయిన సంగతి తెలిసిందే. తన సహజ ధోరణిలో జగన్ ఇవేమీ పట్టించుకోకుండా అమర్ నియామకానికి ఉత్తర్వులు ఇవ్వడం, వారు కొలువుదీరడం అన్నీ జరిగిపోయాయి. ఐతే, తాజాగా బయటికొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు ఒకటి తెగ వైరల్ అవుతూ అమర్ నియామకంపై మళ్లీ సెగలూపొగలు రేపుతోంది. ఇందులో దేవులపల్లి అమర్‌కు ప్రభుత్వం చెల్లించే జీతభత్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. నియామకపు తొలి ఉత్తర్వుల్లో ఈ వివరాలేవీ లేవు. కేవలం అతన్ని ఢిల్లీలో ఫలానా అవసరాల నిమిత్తం నియమిస్తున్నట్టు మాత్రమే వుంది. ఇతర అంశాలకు సంబంధించి విడిగా తెలియపరుస్తామని అందులో పేర్కొన్నారు. ఇదిగో ఆ విడిగా ఇచ్చిన ఉత్తర్వుపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ నలిగి, జనం నోట్లో నానుతోంది. అతనికి ఇచ్చే జీతభత్యాలు, ఇతర సదుపాయాల ప్రస్తావన ఈ ఉత్తర్వుల్లో వుంది.
దేవులపల్లి అమర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెలా అక్షరాలా రూ.3,82,000 అందుతాయి. ఇందులో జీతం 2 లక్షలు. వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునేందుకు.. అంటే ఒక ప్రైవేట్ సెక్రటరీ, ఒక పర్సనల్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్, ఒక డ్రైవర్‌ను నియమించుకునే నిమిత్తం అమర్‌కు అదనంగా మరో రూ.70 వేలు నెలనెలా ముడుతుంది. ఇదిగాక, ఒక వాహనం ప్రొవైడ్ చేస్తారు. నెలకు 250 లీటర్ల ఆయిల్ ఖర్చు, లేదా నెలకు రూ.60 వేల చొప్పున చెల్లిస్తూ లీజు వెహికిల్ సమకూరుస్తారు. మొబైల్ ఫోన్ అవసరాల నిమిత్తం నెలకు రూ.2 వేలు ఇస్తారు. అలాగే, అకామిడేషన్ కింద ఆఫీస్ క్వార్టర్స్ ఇస్తారు. లేదా నెలకు రూ.50 వేలు అందిస్తారు. మెడికల్ రీఇంబర్స్‌మెంట్ కింద ఏపీఐఎంఏ నిబంధనల ప్రకారం ఎంత ఖర్చు అయితే అంతా ఇస్తారు. అలాగే, సెకండ్ క్లాస్ ఏసీ ట్రైన్ లేదా ఎకానమీ ఫ్లయిట్ ఛార్జీల్ని చెల్లిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ అయితే బిజినెస్ క్లాస్ టిక్కెట్ ఛార్జీల్ని అందిస్తారు. మొత్తం నెలకు రూ.3,82,000 దేవులపల్లి అమర్ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది.
సుమారు నాలుగు లక్షల జీతం విషయం పక్కన పెడితే, ఇక్కడే మరో ముఖ్యమైన పాయింటొకటి వుంది. అమర్‌కి ఇస్తున్న అలవెన్సులలో డొమెస్టిక్ ట్రావెల్… అంటే స్వదేశీ ప్రయాణాలకు ఏకానమీ క్లాస్ కానీ విదేశాలకు వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ అని ఇచ్చారు. బిజినెస్ క్లాస్‌లో ఏ యుఎస్‌కో ఓసారి ప్రయాణం చేస్తే ఒకవైపు టికెట్ ధరే కనీసం నాలుగు లక్షల వరకు అవుతుంది. అంటే, జీతం నాలుగు లక్షలకు తోడు, రెండు నెలలకి ఒకసారి విదేశీ ప్రయాణం పెట్టుకుని ఇలా బిజినెస్ క్లాస్‌లో దేవులపల్లి అమర్ ప్రజా ప్రయోజనార్ధం ప్రయాణం చేస్తే అసలే అప్పుల్లో కూరుకొనిపోయిన రాష్ట్ర ఖజానాకి పూడ్చలేని కన్నం పడుతుంది. అందుకే సోషల్ మీడియా ‘సాక్షి’గా జనం అంతలా విరుచుకుపడుతున్నారు.
ముఖ్యమంత్రి నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. కాకపోతే, సీఎంవోలో ముగ్గురు కేబినెట్ ర్యాంక్ సలహాదారులు, ఓయస్డీలు, సీపీఆర్వో, పీఆర్వోలు.. ఇతర సిబ్బంది జీతభత్యాలు లెక్కిస్తే తడిసి మోపెడవుతోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. వీరంతా కేవలం జగన్ మీడియా వ్యవహారాలు చూసేందుకు మాత్రమే. వీరంతా సాక్షికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన వారే కావడం ఇక్కడ ప్రస్తావనార్హం. సీయంవోలో సీయం కోసం చేసిన నియామకాలకు ఇవి అదనం. మళ్లీ ఆ లిస్టు తీస్తే అదో చాంతాండంత ఉందంటున్నారు.