మూడు రాజధానుల వ్యవహారపు చిక్కుముడులు వీడకున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. పరిపాలనా రాజధానిగా చేయాలని భావిస్తున్న విశాఖపట్నానికి అనధికారికంగానైనా ఆ హోదాను కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని అక్కడికి తరలించేందుకు నిర్ణయించడం చర్చనీయాంశమైంది.
ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి రూ.13.80 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తొలుత విజయవాడలో నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అనుమతులు కూడా మంజూరయ్యాయి. కానీ తాజాగా జగన్ ప్రభుత్వం దాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు సిద్ధమైంది. విశాఖలో ఏదేనీ ప్రభుత్వ స్థలంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నిర్మించాలంటూ రాష్ట్ర హోంశాఖ పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో లీగల్ సమస్యలు రాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని డీజీపీకి సూచించింది.
మూడు రాజధానులు అంశంపై ప్రస్తుతం హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుండగానే.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పటికే కృష్ణా బోర్డును విజయవాడ నుంచి విశాఖ తరలించాలని భావిస్తుండగా.. సర్కారు నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.