నగర పాలక సంస్థగా మంగళగిరి !
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి రెండు మున్సిపాలిటీలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో రాజధాని పరిధిలోని ఈ రెండు పట్టణాలను చేజిక్కించుకోవాలని కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ రెండు పట్టణాల పరిధిలో ఎయిమ్స్, డీజీపీ ఆఫీస్, ఏపీఐఐసీ కార్యాలయాలతోపాటు ముఖ్యమంత్రి నివాసం, పలు ప్రభుత్వ సంస్థలు, సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉన్నాయి. అందువల్ల వైసీపీ దృష్టి ఈ రెండు పట్టణాలపై పడింది. ముఖ్యమంత్రి నివాసం కూడా తాడేపల్లిలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఇటీవలి కాలంలో ఎంతో కళ వచ్చింది. రాజధాని శోభ వచ్చింది.
మరి ముఖ్యంగా రాజధానిగా అమరావతి పేరు వినిపించకుండా చేసే క్రమంలో మంగళగిరిని హైలెట్ చేయాలన్న ఉద్దేశం కూడా వారికి ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని పేరును ఇకపై ‘మంగళగిరి’గా మార్చాలన్న ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి. పేరులోనే ‘మంగళ’ప్రదమైన శబ్ధం వున్నందువల్ల ఇకపై ఈ పేరు రాజధానికి దివ్యంగా వుంటుందని అధికార పార్టీకి దగ్గరగా వుండే స్వామిజీ ఒకరు చెప్పినట్టు తెలిసింది. ఇదే నిజమైతే ఇక అమరావతి పేరు వినిపించదు.
తాడేపల్లిలో గత మున్సిపల్ పాలకవర్గం వైసీపీది కాగా, మంగళగిరిలో టీడీపీ పాలకవర్గ పాలన కొనసాగింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తాడేపల్లిలో వైసీపీ మెజార్టీ రాగా, మంగళగిరి మున్సిపాలిటీలో టీడీపీకి 7వేల ఓట్లకుపైగా మెజార్టీ వచ్చింది. ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేస్తే వైసీపీ గెలుస్తుందన్న ఆశతో ఆ పార్టీ వారు ఉన్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురు ఈ రెండు మున్సిపాల్టీలను కలపాలన్న ప్రతిపాదన తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు వేసే అవకాశం ఉంది.