మద్యం రేట్ల పెంపుతో మందు బాబులు శానిటైజర్లను తాగి ప్రాణం మీదికి తెచ్చుకోవడంతో ఏపీ సర్కార్ పునరాలోచనలో పడింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను.. త్వరలోనే భారీగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం 75 శాతం పెంచింది. మద్యపాన నిషేధంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసినప్పటికీ.. అది కొత్త ప్రమాదాన్ని తెచ్చుపెడుతోంది. మద్యం ధరలు పెరగడం, కొన్ని చోట్ల మద్యం దొరక్కపోవడంతో కొంత మంది శానిటైజర్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
మరోవైపు నిత్యం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి భారీస్థాయిలో మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఎన్నిసార్లు పట్టుకున్నా.. లక్షల సంఖ్యలో బాటిళ్లను గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. మద్యంపై కనీసం 30 నుంచి 40 శాతం వరకు ధరలు తగ్గించే యోచనలో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.