మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోసం ఏపీ ప్రభుత్వం లాబీయింగ్ చేస్తోందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మంచు విష్ణు కోసం జగన్ రంగంలోకి దిగారని.. ఈమధ్య జరిగిన సినీ పెద్దల భేటీలో దీనిపై చర్చ జరిగిందని వార్తలు వచ్చాయి. పైగా జగన్ మీ బంధువైతే ‘మా’ ఎన్నికలకు వస్తారా అంటూ విష్ణుపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. మంత్రి పేర్ని నాని ఓ వీడియో సందేశం ద్వారా క్లారిటీ ఇచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు.. సీఎం జగన్, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు నాని. అక్టోబరు 10న జరగనున్న ‘మా’ ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆసక్తి, ఉత్సాహం లేదని చెప్పుకొచ్చారు. ‘మా’ ఎన్నికల్లో ఏ వ్యక్తినీ, వర్గాన్ని తాము సపోర్ట్ చేయడం లేదని… తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.