ఏపీలో కరోనా కేసులు ఎక్కువ అవుతోన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోనున్న ప్రైవేట్ ఆసుపత్రులను తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్తోన్న జగన్ సర్కార్ ఈమేరకు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనున్న వసతులన్నింటిని ప్రభుత్వం ఉపయోగించుకునుంది. అలాగే అవసరమైతే ఆస్పత్రుల్లో పనిచేసే ప్రత్యేక విభాగాలకు చెందిన వైద్యులను కూడా వాడుకోనుంది. ప్రభుత్వం తీసుకొన్న ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయాలకు అనుగుణంగా వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎపీలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి సహకరించాలని పేర్కొన్నారు.