దశాబ్ద కాలంగా సాగుతున్న మీ సేవలు ఇక చాలు ! ఇది జగన్ సర్కార్ అభిప్రాయం! ఇక సిటిజన్స్ సర్వీసెస్ ఆఫ్ ఏపీ పేరుతో కొత్త అవతారం ఎత్తుతాయి.
గుంటూరు: ఇక మీసేవ కేంద్రాల పేరు కనిపించదు. పల్లెల నుంచి పట్టణం వరకు ప్రభుత్వ సర్వీసులకు ఇక సచివాలయాలే కేరాఫ్ అడ్రస్. పాలనా సంస్కరణల్లో భాగంగా మార్పులు చేర్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రస్తుత ప్రజా సర్వీసుల నిర్వహణకు వీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని అర్ధంతరంగా ఉద్యోగాల నుంచి పక్కనపెట్టారు. మీసేవ కేంద్రాలకు ప్రభుత్వం దాదాపు మంగళం పాడినట్టేనంటున్నారు.
మీసేవ కేంద్రాలకు ఇప్పటిదాక 240 పైగా సర్వీసులు విస్తరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లను ఎక్కడికక్కడ నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టారు. ఈ సచివాలయాలే భవిష్యత్‌లో ప్రజాసేవా కేంద్రాలుగా మారబోతున్నాయి. సాధ్యమైనంత మేర ఎక్కువ సంఖ్యలో సేవలను అందించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న విధానంలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ ఆన్‌లైన్ పేరిట ఇప్పటిదాక నిర్వహించిన సేవల్లో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం ఏపీ ఆన్‌లైన్ కింద వివిధ జిల్లాల్లో మేనేజర్లుగా వ్యవహరిస్తున్న వారిని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇప్పటి వరకు మీసేవ కేంద్రాల నిర్వహణలో మూలంగా ఉన్న ఏపీ ఆన్‌లైన్ పేరులో మార్పులు వచ్చిపడ్డాయి. దీనికి బదులుగా సిటిజన్స్ సర్వీసెస్ ఆఫ్ ఏపీగా మార్పుచేశారు.