విజయవాడ స్వర్ణప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్ కేసు వ్యవహారంపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. కేసు దర్యాప్తును కొనసాగిస్తూ.. అస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
అగ్ని ప్రమాదం తర్వాత రమేశ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేశ్‌బాబు, చైర్మన్ సీతారామమోహన్‌రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపై కేసులు పెట్టడాన్ని సవాలు చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తమపై కేసును కొట్టవేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో వారిపై తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశించిన హైకోర్టు.. హోటల్‌లో కరోనా కేర్ సెంటర్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన అధికారులను కూడా నిందితుల జాబితాలో చేర్చాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తాజాగా జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, స్వర్ణప్యాలెస్‌లో ఆగస్టు 9న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.