అమరావతిని నుండి రాజధాని తరలింపు లాంఛనమేనన్న మరో వార్త సంచలనం రేపుతోంది. ఉగాది తర్వాత అమరావతి నుండి ఉద్యోగులు వైజాగ్ వెళ్లిపోయేందుకు మానసికంగా సిద్దం చేస్తున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అమరావతి నుండి వైజాగ్ వచ్చే సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం నజరానా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో… ఏపీ ప్రభుత్వం రాజధాని మార్పు నిర్ణయం తీసుకోవటంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. పిల్లల చదువులు, ఇళ్లు ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న అంశం కావటంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. పైగా భవిష్యత్‌లో ఉద్యోగుల పిల్లల స్థానికత అంశంపై ఈ మార్పు ప్రభావం చూపనుండటంతో ఉద్యోగులు ఏటూ తేల్చుకోలేకపోతున్నారు.
అయితే, ఉద్యోగుల ఆందోళనలకు సమాధానం చెప్పటంతో పాటు హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చి ఇప్పుడు వైజాగ్‌కు షిఫ్ట్ అయ్యే సచివాలయ ఉద్యోగులకు రాజధాని ప్రాంతంలో 200గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనపై ఉద్యోగులు కూడా అభ్యంతరం చెప్పకుండా ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు కనపడుతోంది.
అమరావతి రాజధాని అని తెలిశాక కొందరు, సచివాలయం మార్పుతో ఇంటి అద్దెకు బదులు లోన్‌లు పెట్టి మరికొందరు సొంత ఇళ్లను కొనుగోలు చేశారు. కానీ ఇక్కడ లోన్ చెల్లిస్తూ… ఇప్పుడు విశాఖలో మళ్లీ అద్దె చెల్లించటం అంటే ఉద్యోగులు బెంబెలెత్తిపోతున్నారు. పైగా ఇక్కడ కొనుకున్న ఇళ్లకు ఇప్పుడు మార్కెట్ భారీగా తగ్గిపోవటం కూడా వారిని కలచివేస్తుంది. దీంతో ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ప్రభుత్వం తరుపునే రుణాలు మంజూరు చేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రైతులు, రాజధాని ప్రాంత వాసుల నుండి వ్యతిరేకత తీవ్ర తరం అవుతున్న నేపథ్యంలో… ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.