కరోనా నియంత్రణ,నివారణ చర్యలు పై సమీక్షలు చేస్తున్నామన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని. ఒంగోలు రిమ్స్ లో ఉన్న కరోన పాజిటివ్ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతనితో సంబంధం ఉన్న అందరిని గుర్తించామని, వాళ్ళని కూడా ఐసోలేషన్ లో ఉంచి పరిశీలన చేస్తున్నామని తెలిపారు. వాళ్ళ కుటుంబ సభ్యులుకు సంబంధించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్స్ కి పంపించామన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని, పూర్తి అవగాహనతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు.
ప్రజల సహకారంతో కరోనా ను పారదోలుదామని పిలుపునిచ్చారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రద్దీ మాల్స్ , గుడులు, బడులు ,సినిమా హల్ల్లు మూసివేశాము. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసే కరోనాని సంకల్పం, జాగ్రత్తలతో ఖచ్చితంగా పారదోలాలని, మాస్క్ లు వాడటమే కాదు.. వాటిని సరిగా డిస్పోజ్ చేయకపోతే కొత్త సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రకాశం జిల్లా వైద్యుల పరిశీలనలో 18 కేసులు ఉన్నాయి. వీటిలో 28 రోజులు దాటినవి 10 కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కేసులు వైద్యుల పరిశీలనలో ఉన్నాయి.అందులో 250 కేసులు 28 రోజులు దాటినవని తెలిపారు. శాంపిల్స్ పంపినవి 130 కేసులు. ఇందులో 3 కేసులు పాజిటివ్ వచ్చాయని మంత్రి తెలిపారు.