ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ పై ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయగా… సింగిల్ బెంచ్ ధర్మాసనం ఎన్నికల షెడ్యూలును సస్పెండ్ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు… ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు అన్న సుప్రీంకోర్టు తీర్పులను కోర్టు ముందు ఉంచిన ఎస్ఈసీ వాదనతో ఏకీభవించింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చని, సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.