ప్రభుత్వ భూముల అమ్మకాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈనెల 26కు వాయిదాపడింది. మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోందని ఆరోపించడంతోపాటు ఎవరో దాతలు ప్రభుత్వ ప్రయోజనాలకోసం, ప్రజోపయోగం కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూములను విక్రయించడం సరికాదని పిటిషన్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేసేందుకు, ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో ధర్మాసనం మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ సామాజిక వేత్త తోట సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.