ఏపీలో నమోదైన ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను బిల్డ్ ఏపీ పేరుతో అమ్మకానికి పెట్టడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ నిధులు ఎందుకోసం అంటూ కోర్టు ప్రశ్నించగా… ప్రభుత్వ లాయర్ బదులిస్తూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. దీంతో కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎంత బాగా అమలవుతున్నాయో ప్రజలకు తెలుసని, ముఖ్యంగా మందుబాబులకు సర్కార్ కృతజ్ఞత చెప్పాలన్నారు. కరోనా వైరస్ సమయంలోనూ అధిక ధరలు వెచ్చించైనా మద్యం కొనుగోలు చేసి.. రాష్ట్ర ఖజానాకు తమ వంతు సహాయం అందించారన్నారు. ఈ విచారణలో భాగంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏమైనా ఉందానని కోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వానికి ప్రజల ఆస్తులను అమ్మే హక్కు లేదని పిటిషనర్ వాదించగా… కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ… డిసెంబర్ 17కు కేసు విచారణను వాయిదా వేసింది.