ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇటీవల ప్రకటన విడుదల చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం… ఎన్నికల ప్రక్రియను నిలివేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టును అశ్రయించింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ ఏకపక్షంగా ప్రకటన చేసిందని పిటిషన్‌లో ఆరోపించింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6వేల మందికిపైగా మృతి చెందారని.. ఎన్నికల నిర్వహణతో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టిన హైకోర్టు తాజగా తీర్పును వెల్లడించింది