ఏపీలో పీఆర్సీ అంశం చుట్టూ వివాదం కొనసాగుతుండగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని తేల్చి చెప్పింది.
పీఆర్సీ పర్సంటేజ్‌లపై ఛాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది హైకోర్టు. ఎంత జీతం తగ్గిందో చెప్పాలని ఉద్యోగులను ప్రశ్నించింది. పూర్తి డేటా లేకుండా ఎలా పిటిషన్ వేస్తారని ప్రశ్నించింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్.. ఉద్యోగులకు జీతాలు పెరిగాయని కోర్టుకు తెలిపారు. లెక్కలతో సహా వివరించారు. ఉద్యోగులకు న్యాయం చేసే దిశగానే ప్రయత్నిస్తామని తెలిపారు.
హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం ఇదంతా జరగలేదంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరుఫు న్యాయవాది. దీనికి ఏకీభవించని న్యాయస్థానం.. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని తెలిపింది. సమ్మె నోటీసు ఇచ్చిన 12 మంది కమిటీ సభ్యులు కూడా విచారణకు రావాలని స్పష్టం చేసింది.