ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఉపాధ్యాయుల బదిలీలకు, మీ సంఘానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గత విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిచేసి బదిలీల ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం పిల్ దాఖలు చేయగా, జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ ఏడాది నవంబర్ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఉపాధ్యాయుల బదిలీలతో పిటిషనర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించింది. బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని, అభ్యంతరాలుంటే టీచర్లే కోర్టు కొచ్చి పోరాడే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. బదిలీలతో సంబంధం లేని బీసీ సంక్షేమ సంఘం పిల్ దాఖలు చేయడం పరిధి దాటి వ్యవహరించడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ తన పిల్ ను ఉపసంహరించుకున్నారు.