పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు లేవని వ్యాఖ్యానించటంతో సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ బాబు కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సస్పెండ్ అయిన సుధాకర్ బాబు విశాఖలో అర్ధనగ్నంగా రోడ్డుపై ఉండటం, పోలీసులు లాఠీకి పనిచెప్పటంపై కోర్టు విచారణ చేపట్టింది.
ఇప్పటికే ఈ కేసులో విశాఖ సెషన్స్ కోర్టు జడ్జితో సుధాకర్ బాబును ఎంక్వైరీ చేయించిన హైకోర్టు… సెషన్స్ కోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టు సీబీఐ ఎంక్వైరీ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం పోలీసుల చర్యలపై సీబీఐ విచారణ చేయాలని, 8 వారాల్లో సీబీఐ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా… ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో అనేక అంశాలు లేవని, సెషన్స్ కోర్టు జడ్జి నివేదికలో సుధాకర్ బాబు ఒంటిపై గాయాలున్నాయని చెప్పారని కానీ పోలీసుల నివేదికలో అలాంటివి లేవని కోర్టు వ్యాఖ్యానించింది. తాము ప్రభుత్వ నివేదికను నమ్మటం లేదని… ఇందులో భారీ కుట్ర ఉందేమోనన్న అనుమానాన్ని కోర్టు వ్యక్త పర్చింది.