ఏపీలో కరోనా వైరస్ కేసులను ట్రీట్ చేస్తున్న తమకు పీపీఈ కిట్స్, మాస్కులు కూడా అందుబాటులో లేవని విమర్శించి, సస్పెన్షన్ కు గురైన డాక్టర్ సుధాకర్ కేసు మలుపు తిరిగింది. రోడ్డుపై తాగి అల్లరి చేస్తున్నారంటూ, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇంటా బయట విమర్శలు వ్యక్తం కాగా… ఈ అంశాన్ని కోర్టు సుమోటోగా తీసుకుంది.
డాక్టర్ రమేష్ కుమార్ ఆద్వర్యంలోని ద్విసభ్య బెంచ్ ముందు జరిగిన వాదనల్లో… నడి రోడ్డుపై డాక్టర్ సుధాకర్ ను కట్టేసి కొట్టిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. డాక్టర్ సుధాకర్ ను వృద్ధురాలైన తన తల్లి చూసేందుకు కూడా అనుమతించకపోవటంపై కోర్టు ప్రశ్నించింది.
ఓవైపు డాక్టర్లను దైవంతో సమానంగా చూస్తూ… హెలికాప్టర్ నుండి పూలు చల్లుతూ అభినందిస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు దేనికి సంకేతం అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టు ముందు హజరు కావాలంటూ ఆదేశించింది.