జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టేసింది హైకోర్టు.
ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు జరిగాయి. 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ.. నిర్వహణలో నిబంధనలు పాటించలేదని ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం మే 21న తీర్పునిచ్చింది. మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు జరపాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
వచ్చిన అప్పీళ్లపై ఆగస్టు 5న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది. రాష్ట్రంలో 515 జెడ్పీటీసీలు, 7వేల 220 ఎంపీటీసీలకు ఏప్రిల్ 8న పోలింగ్ జరిగింది.