పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఎస్‌ఈసీ భావిస్తున్న తరుణంలో ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని, ఎస్‌ఈసీని నిలువరించాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని, ఎన్నికల ప్రక్రియలో సామాన్యంగా కోర్టులు కూడా జోక్యం చేసుకోవని ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఎస్‌ఈసీ విధి నిర్వహణకు ప్రభుత్వం సహకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్న అంశాన్ని ఎన్నికల కమిషనర్ ఇప్పటికే గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
అయితే… ఎన్నికల నిర్వహణ పై స్టే ఇవ్వకున్నా, ఈ పిటిషన్ పై శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.