తానేటి వనిత, ఏపీ హోంమంత్రి
అమలాపురం ఘటనపై డీజీపీతో సమీక్షించా. ఆందోళనలు జరగకుండా అడిషనల్ డీజీ, డీఐజీ, ఎస్పీలను, అదనపు బలగాలను పంపించాం. అమలాపురంలో ఆందోళన పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండొచ్చు.
హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో 7కు పైగా కేసులు ఉన్నవారిని 72 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.
నాయకుల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులపై కూడా దాడి చేశారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారు. అమలాపురం ఘటనలో ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు, ఆందోళనకారులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
పోలీసులు తాము గాయపడినప్పటికీ ప్రజలకు రక్షణగా ఉంటూ.. ఆందోళనకారులను అదుపుచేశారు. అల్లర్ల సమయంలో పోలీసులు వ్యవరించిన తీరే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనం. పోలీసులను అభినందిస్తున్నాను. సోషల్ మీడియా ద్వారా రూమర్స్ వెళ్ళకుండా అమలాపురంలో ఇంటర్నెట్ నిలిపివేశాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా వున్నారు. ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.