విశాఖకు రాజధాని తరలింపుపై ముందు నుండి ఆతృతగా ఉన్న సీఎం జగన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కరోనా వైరస్, కోర్టులు, స్థానిక ఎన్నికలు ఎదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. గవర్నర్ మూడు రాజధానుల బిల్లుపై సంతకం కాగానే… ఈసారి ఆగస్టు 15 వేడుకలు విశాఖలో చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం సాగింది.
కానీ మూడు రాజధానుల తరలింపుపై ఏపీ హైకోర్టు ఆగస్టు 14వరకు స్టేటస్ కో మెయింటెన్ చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు 14వరకే ఉన్నందున… సీఎం జెండా వందనం విశాఖలోనే చేస్తారని వైసీపీ వర్గాలు మొదట భావించాయి. కానీ తాజాగా ఆ ప్రతిపాదనను సీఎం జగన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్టుల నుండి వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులతో ప్రభుత్వానికి అప్రతిష్టవస్తుందని… ఈసారికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలోనే జెండా వందనం కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
విశాఖలో ఆగస్టు 15 వేడుకలకు వైసీపీ కూడా భారీ ఏర్పాట్లు చేయాలని భావించింది. ఓరకంగా లాంఛనంగా ప్రారంభం అయినట్లేనంటూ నేతలు కామెంట్స్ కూడా చేశారు. అమరావతి రైతులతో ప్రతిపక్షాలు చేయిస్తున్న రాద్ధాంతానికి ముగింపు అంటూ వేడుకలు చేయాలని భావించారు.