విశాఖపట్నానికి 20 కిలో మీటర్ల దూరంలో….రిషికొండ దగ్గర…సముద్రానికి ఎదురుగా…అతి పెద్ద బిల్డింగులు…మిలీనియం టవర్స్. ఎన్నో ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్న ఈ మిలీనియం టవర్స్ 2019 లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు, ఔత్సాహిక ఐటీ ఎంటర్ ప్రునర్స్ కు అడ్డాగా మారింది. ఒక సంవత్సర కాలంలోనే హె.సి.ఎల్, ఎల్&టి వంటి పదుల సంఖ్యలో పేరుమోసిన కంపెనీలు మిలినీయం టవర్స్ లో వెలిశాయి. కానీ ఇప్పడు వారంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూడు రాజధాను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించింది. దీని కోసం అమరావతి నుంచి అన్ని కార్యాలయాలను ఈ నగరానికి తరలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు తరచుగా విశాఖ పట్నంలో పర్యటిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన బిల్డింగుల కోసం వెతుకుతున్నారు. అందులో భాగంగానే మిలీనియం టవర్స్ ను తాత్కాలిక సెక్రెటేరియట్ గా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ పుకార్లకు బలాన్ని చేకూరుస్తూ ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీ రజత్ బార్గవ ఇటీవల మిలీనియం టవర్స్ ను సందర్శించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మార్చి 30 వరకు ఖాళీ చేయాలని కంపెనీలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
ఇదే విషయంపై కాండ్యుయెంట్ సీఈవో మాట్లాడుతూ..భవిష్యత్ కోసం తాము ఈ మిలీనియం టవర్స్ లో కంపెనీ పెట్టాం…ఇప్పుడు మా పరిస్థితి అయోమయంగా ఉంది.” ఆపరేషన్స్ నిలిపేసి 2400 మంది ఉద్యోగులను ఇక్కడి నుంచి కొచ్చి లేదా హైదరాబాద్ కు తరలించాలని బోర్డు నిర్ణయించింది” అని చెప్పారు. 2019 మార్చిలో లీజ్ కు తీసుకున్న ఈ బిల్డింగ్ ను ఖాళీ చేయాల్సి వస్తే దాదాపు 18000 ఉద్యోగులు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అంతే కాదు..కంపెనీని బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఇక్కడకు తరలించడానికి ఇంటీరియర్స్ కోసం రూ. 21 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 3 కోట్లు ఖర్చయిందని సీఈవో తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయం ఐటీ కంపెనీల్లో అభద్రతను సృష్టించింది. కనీసం కంపెనీల తరలింపు ఖర్చులనైనా ఇస్తుందో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద భవిష్యత్ పై ఎంతో ఆశతో వైజాగ్ కు తరలి వచ్చిన ఐటీ కంపెనీలకు నిరాశే మిగిలింది.