పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో పాలన కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల పేరిట మరో గండం వచ్చిపడింది. ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమర శంఖం పూరించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఉద్యమంలో 13లక్షల ఉద్యోగులను ఏకం చేసే కార్యక్రమాలను చేపట్టామని ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని అన్నారు.
2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదని.. ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని మండిపడ్డారు విద్యాసాగర్. 7 పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన ఏకైక సర్కార్ ఇదేనని ఆరోపించారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. ఈ డిమాండ్లతో పాటు ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలుసని.. ఉద్యమం ద్వారానే అన్ని హక్కులు సాధించుకుంటామని విద్యాసాగర్ స్పష్టం చేశారు.