నివర్ తుపాన్ నష్టంపై ఏపీ శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు, ఎక్కడ ఆ మాట అన్నారో.. ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే బొత్స తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సభలో లేని వ్యక్తి గురించి అసత్యాలు మాట్లాడటం తగదని అన్నారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. మనసులో మాట అనే పుస్తకంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అని రాశారని చెప్పారు.. ఆ పుస్తకం తీసుకొస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏం మాట్లాడారో చూపిస్తామని అన్నారు.ఇదే విషయమై మంత్రి బుగ్గన కూడా మాట్లాడారు. మనసులో మాట అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అంటూ రాసుకున్నారని.. ఆ వ్యాఖ్యలని చూపిద్దామంటే.. పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో కూడా తొలగించారని చెప్పారు. వ్యవసాయంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందునే మనసులో మాట పుస్తకాన్ని మార్కెట్‌లో దొరకకుండా చేశారంటూ బుగ్గన ఆరోపించారు.