తెలంగాణ ప్రభుత్వంపై కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ఫిర్యాదు చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ చేస్తున్న నీటి వినియోగంపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు నీటి విడుదలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. వేసవిలో తాగు నీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నందున సాగర్ నీటితో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలువరించాలని ఆయన లేఖలో కోరారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం నీటిని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. వెంటనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ అవసరాల కోసం నీటి విడుదలకు నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని నారాయణరెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.
‘తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని విడుదల చేస్తోంది. ఇలా చేస్తూ పోతే ఆ నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేసే పరిస్థితులు ఏర్పడతాయి. సాగర్ దిగువ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నందున ప్రాజెక్టులో నీటిని భద్రపరుచుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సాగర్ నీటితో జల విద్యుదుత్పత్తి చేయకుండా నిలువరించాలి’ అని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు.
ఎన్ఎస్పీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి నీరు భారీగా వచ్చేస్తోందని, ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 40.580 టీఎంసీలే అని ఆయన లేఖలో తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి వదిలే నీటి ద్వారా పులిచింతల రిజర్వాయర్ నీటి మట్టం అసాధారణంగా పెరిగిపోతోందని.. పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది వచ్చిన వరద కారణంగా 16వ నెంబర్ గేటు కొట్టుకు పోయిందని నారాయణరెడ్డి గుర్తుచేశారు. నీటి నిల్వ చేయలేక పూర్తిగా నీటిని సముద్రం పాలు చేయాల్సి వచ్చిందన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లో మరింతగా పెరిగితే పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసే అవకాశం ఉండదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారని నారాయణరెడ్డి తెలిపారు. అలాగే, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉందని, ఇంకా నీటిని విడుదల చేస్తే.. ప్రకాశం బ్యారేజీతోపాటు పులిచింతల ప్రాజెక్టుకు ఇబ్బందులు కలిగేలా ఉందని వివరించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం మినహా మరోమార్గం లేదని చెప్పారు. వేసవిలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచుకోవాలని, అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించాలంటే ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి వినియోగాన్ని అడ్డుకోవాలన్నారు. తక్షణం విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి వినియోగాన్ని నిలుపుదల చేసేలా ఉత్తర్వులివ్వాలని ఈఎన్సీ కేఆర్ఎంబీని లేఖలో వివరించారు.