స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం, వైసీపీ ప్రభుత్వం మధ్య జగడం మరింత ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై గవర్నర్‌కు ఆయన ఓ లేఖ రాశారు.
రాజ్యాంగంలోని 243 కే అధికరణ ప్రకారం ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధి అని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను ఒకే రకమైన అధికారాలు ఉంటాయని లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు నిర్వహించాలని ఇకవేళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని తిరస్కరించాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. తాజా లేఖతో రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య రగడ మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది.