ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు జాబితాపై నెలకొన్న వివాదంపై చిక్కుముడి వీడింది. 2019 నాటి ఓటర్ల జాబితాతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త జాబితా కోసం దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 2019 ఓటరు జాబితాతో ఎన్నికల నిర్వహిస్తే 3.60 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు వేయలేకపోతున్నారని.. అందుకే 2021 జాబితాతో నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన హైకోర్టు.. రెండు పిటిషన్లను కొట్టివేసింది.
ఓటరు జాబితాపై ఎస్‌ఈసీదే తుది నిర్ణయమని ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించింది. అటు కొత్త జాబితా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనల అనంతరం ఈసీ నిర్ణయమే ఫైనల్ అని.. ఎన్నికల ప్రక్రియలు జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.