టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై తనదైన రీతిలో సెటైర్లు వేశారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. నీ ఆరోగ్యం మెరుగు పరుచుకునే యాత్రకు యవగళం అనే పేరెందుకు? అంటూ ఎద్దేవా చేశారు. నడక మంచిది.. ముఖ్యంగా లోకేష్ లాంటి వ్యక్తులకు మరింత మంచిదని సలహా ఇచ్చారు. లోకేష్ మీ నాన్న గారు యువకులకు చేసిన మోసం.. ఈ రాష్ట్రంలో ఏ యువకుడు మర్చిపోలేదన్నారు.
బాబు వస్తే జాబు వస్తాదని, ఇంటికో ఉద్యోగమని అన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మా నియోజక వర్గంలో 50 మందిని చూపించు.. ముఖ్యమంత్రి యువనేస్తం కాదది.. యువమోసం అన్నారు. మోసాల మీద వెన్నుపోట్ల మీద అధికారంలోకి వచ్చిన దౌర్భాగ్య చరిత్ర మీదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్ బయటకు రావడం జరిగింది. నువ్వు, నీ తండ్రి తలక్రిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేరని బలంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను తగ్గించటానికి ప్రతి పక్షాలు రకరకాల జిమ్మిక్కులు, పగటి వేషాలు వేస్తున్నారన్నారు.
మొన్నటివరకు బాదుడే బాదుడని.. మళ్లీ పేరు మార్చి ఇదేం ఖర్మరా? అని వస్తే ప్రజలు తోసిపుచ్చారన్నారు. పాదయాత్ర చేయడానికి కారణమేంటి? సమయం.. సందర్భం ఉందా? అని ప్రశ్నించారు. కేవలం అధికార కాంక్ష మాత్రమే అన్నారు. నీవు చేసే యాత్రల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు మంత్రి సీదిరి అప్పల రాజు.