విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని మరోసారి స్పష్టం చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన వెల్లడించారు.
ఈ మేరకు టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంటే… టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల అంశంపై ఆ రెండు పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా టీడీపీ, జనసేనలు అడ్డుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. విశాఖకు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు ఆడే ఆటలు ఇకపై చెల్లబోవని బొత్స పేర్కొన్నారు. జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదు… ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణించారు.
జనసేనతో పాటు టీడీపీకి విశాఖపై అంత కక్ష ఎందుకని నిలదీశారు బొత్స. విశాఖకు పరిపాలనా రాజధాని రావాలన్న కాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందని బొత్స తెలిపారు. ఈ విషయం శనివారం జరిగిన విశాఖ గర్జనలో స్పష్టమైందని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.